భూమికి, రికార్డుకు లింకు కలవాలి

 ‘‘సెప్టెంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 31 వరకూ 10,785 గ్రామాల్లో 1,193 బృందాలు భూముల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక్కో బృందం 9 గ్రామాల్లో.. ఒక్కో గ్రామంలో పది రోజులపాటు నిర్వహించాలి. జనవరి ఒకటో తేదీ నాటికి నూతన సంవత్సర కానుకగా సవరించిన, సరళీకరించిన, ఆధునీకరించిన రికార్డులు అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. భూములకు, రికార్డులకు లింకు లేకుండా పోయిందని, క్షేత్రస్థాయిలో భూమి ఒకరి చేతుల్లో ఉంటే.. రికార్డులో మరొకరి పేరు ఉందని, భూమికి, రికార్డులకు లింకు కలవాలని స్పష్టం చేశారు.
అంకితభావంతో చేసే ఏ పనైనా విజయవంతమవుతుందని, ప్రక్షాళన కార్యక్రమాన్ని అధికారులు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, పితృ వాత్సల్యంతో నిర్వహించాలి’’ అని పిలుపునిచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణపై ప్రగతి భవన్‌లో గురువారం కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళనను కలెక్టర్లే ముందుండి నడిపించాలి. అవసరమైతే కొంతమందిని తాత్కాలిక పద్ధతిపై నియమించుకోండి. రికార్డులన్నీ సక్రమంగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు.
వచ్చే మూడు నెలలపాటు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ పనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వివిధ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు సేకరించారు. ఆ వివరాలేవీ రికార్డుల్లో లేవు. ఆ భూములు రైతుల వద్దే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. దాంతో ఇబ్బందులు వస్తున్నాయి. పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుల లెక్కలు ఆరా తీస్తే, రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, వ్యవసాయ శాఖ రికార్డుల్లో మరోలా వివరాలున్నాయి. అందుకే ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలి’’ అని సూచించారు. ‘‘రైతుకు కావాల్సింది ప్రధానంగా మూడు అంశాలు. ఒకటి.. సాగునీరు, రెండోది పెట్టుబడి, మూడోది గిట్టుబాటు ధర. వీటి విషయంలో చేయూత అందితే వ్యవసాయం బాగుపడుతుంది. అందుకే సాగునీరు అందివ్వడానికి ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.